Wednesday, 28 May 2008

10-04-1985(1)

"ఊళ్ళో ఇంతమంది కుఱుపులు కోశాను కానీ ఈ నా చిన్ని కుఱుపంత బాధ ఎప్పుడూ చూడలేదు" అన్నాట్ట ఓ నాటు వైద్యుడు. ఊళ్ళో అంతమందీ ఎంత బాధపడ్డారో అతనికేం తెలుస్తుందీ! అవన్నీ వారికి. మఱి ఈ బాధ తనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది తన బాధ కనుకా.

ఏదైనా అంతే - తనదాకా వస్తే గానీ ఏదీ తెలియదు. తెలియదంటే అసలు తెలియదని కాదు. పూర్తిగా తెలియదని మాత్రమే. ఒకొక్కసారి ఎవరో, ఏదో తన గొడవ చెప్పి గోల పెడితే ఇదేమంత గొప్ప విశేషమని ఇలా లబలబలాడతాడితనూ అనిపిస్తుంది. అదే, అంతకన్నా చిన్నదే తనకు కలిగినపుడు ఊరంతా ఒకటి చేదామన్న ఆవేశం వస్తుంది. ఆవేదన కలుగుతుంది.

మనమెంత లోకజ్ఞానం కలవారమైనా, ఎంత సమవర్తులం అని అనుకున్నా అదంతా కేవలం భ్రమ మాత్రమే. ఆ! మరీ విచిత్రం - ఇంత తలక్రిందులయిపోతున్నాడేమిటీ ఈ చిన్నదానికీ అనే అనుకుంటాం - అది వేరొకరికి సంబంధించినది అయినపుడు.

Thursday, 22 November 2007

తేదీ లేదు...(1)

ఎవరో అన్న ఓ చిన్న మాట చాలు, మనసు వికలం అయిపోవచ్చు. ఓ చిన్న సంఘటన చాలు, చిత్తం చంచలమైపోవచ్చు. ఒక దృశ్యం చాలు బుద్ధి పెడతలబట్టవచ్చు. ఏమీ లేకనే ఒక్కోసారి నీకు తెలియకనే నీ తల పని చేయకపోవచ్చు. ఇంతకూ ఎలాంటివి ఎలాంటివారిని ఇలా ఇబ్బంది పెడతాయో నిర్థారణగా చెప్పలేము. కొందఱను చూడగానే మఱికొందఱకు గుండెలు దండోరా వేయడం మొదలు పెట్టవచ్చు. స్థిరచిత్తులకు ఇలాంటివేవీ చిన్నమెత్తు నష్టం కల్పించలేవు. మనోబలం లేనివారికి ఎప్పుడో, ఎక్కడో జరగబోయే నష్టమో కష్టమో తలపునకు వచ్చినా చాలు, బ్రదుకే తలక్రిందులయినట్లు తోస్తుంది. అన్నీ మనమేలుకే అనుకోగల ఆశావాదులు కొందఱయితే, అన్నీ మనకు వ్యతిరేకంగానే పరిణమిస్తున్నట్టు కొందఱు భావించుకుంటారు. ఎదురుదెబ్బలకు తట్టుకోగలవారు కొందఱు, చదికిలబడిపోయేవారు కొందఱు.

ఒకొక్కరిది ఒకొక్క తీరు. ఒకొక్కరిది ఒకొక్క దారి.

06-03-1985(1)

కలలలో తేలిపోవడం చాలామందికి ఇష్టం. వాస్తవస్థితి హాయిగా లేనప్పుడు కనీసం తనకు తాను సృష్టించుకున్న స్వప్నజగత్తులోనైనా ఏదో ఇంత సౌఖ్యం కానవస్తుందేమోనని వెంపర్లాడడం సహజం. తన మనః ప్రశాంతి కోసం ఎక్కడైనా సరే మనిషి అన్వేషిస్తూ ఉంటాడు. ఆ అన్వేషణ అలా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. జీవితం బహు చిత్రమైనది. అనుకున్నపుడు హాయినివ్వదు. బరువుగా అడుగులు వేయలేక ముందుకు సాగలేక చదికిలబడిపోదామా అనుకునేటప్పుడు ఒక్కొక్కమాఱు ఏదో ఇంత చల్లని గాలి వీస్తుంది. చిఱుచెమటలు ఆరిపోతూ శీతలశీకర స్పర్శతో మైమఱచిపోదామా అనిపిస్తుంది. అదీ ఏమంత సులభం కాదు. అలా అమ్మయ్య అని నిట్టూరుస్తుండగానే నిప్పులు చెఱగే నిశ్వాసం బయలువెడలుతూ ఉంటుంది. అంతలోనే తాననుకున్నదంతా చిందఱవందఱై చిద్రువలై చిటపటలు చెలరేగగా ఎందుకీ తాపత్రయం అనిపిస్తుంది.

అలా ఆశ కల్పించి కాస్త ముందుకు సాగనివ్వడం, అంతలో నైరాశ్యంలోనికి త్రోసివేయడం బ్రదుకులో అలవాటు.

Tuesday, 19 June 2007

తప్పులెన్నువారు(4) - 1983

లేనిపోని చిక్కులలో పడిపోవడం ఎందుకని అడుగు ముందుకేయనివాడు జన్మలో ఏమీ చేయలేడు. ఎక్కడ తప్పటడుగు వేస్తామో అనుకొని జంకేవాడెవ్వడూ ముందుకు సాగిపోలేడు. పనికి దిగిన తర్వాత తప్పులు చేస్తే చేస్తాం. వాటిని దిద్దుకునేందుకు వీలెప్పుడూ ఉండనే ఉంటుంది. అసలు లోపం లేకుండా ఏదీ ఉండదు. ఏదో వ్రాసినా, చేసినా, అన్నా, ఆడినా, ఏమయినా ఏదో తప్పు రావచ్చు. రాకనూ పోవచ్చు. చిత్తశుద్ధీ, సంకల్పశుద్ధీ ఉన్నప్పుడు ఆ మొదలుపెట్టిన పని కొనసాగి తీరుతుంది. అలాకాక ఏవైనా తప్పులు చేస్తామా ఫరవాలేదు. ఆ తర్వాతివారెవరో దిద్దుతారు. అసలేమీ చేయకుండా పోవడం కంటే తప్పో ఒప్పో చేసి దానిని సరిచేసుకునేందుకు సిద్ధపడడం మంచిది. ఎవరో తప్పుపడతారేమో అని వెనుదీయరాదు. అలాగే వారేదో నిజంగా తప్పెత్తి చూపితే దిద్దుకొనకుండా ఉండనూ రాదు. అందుకే నడిచేవాని కాలు జారితే తప్పేం కాదన్నారు పెద్దలు.

తప్పులెన్నువారు(3) - 1983

కానీ పదుగురకు పనికివచ్చే పని ఇదీ అనుకుంటే వెంటనే దానికి శ్రీకారం చుట్టడం పనిచేసే వారి లక్షణం. మీనమేషాలు లెక్కించుకుంటూ, తిథివారాలు చూసుకుంటూ కూచోడతను. ముందు పని. తర్వాతే ఏదైనా - ఇదీ క్రియాశీలుని వైఖరి. ఏపనిలో నైనా కష్టనష్టాలు తప్పవు. ఏవో క్లిష్ట సమస్యలు తప్పవు. వాటికి భయపడి వెనుకంజ వేయడం పిరికితనం. సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారమార్గం చూసుకోవాలి. ముందే బెంబేలెత్తిపోరాదు. ఏ గతుకులూ లేని బాట ఎన్నడూ కానరాదు. నిష్కటంకమైన దారి ఎక్కడా ఉండదు. తాను నడుస్తూ, దారిని సరి చేసుకుంటూ కొండలు అడ్డమైనా సరే, తప్పుకొని పోవలసి వస్తే తప్పుకొని పోతూ, వీలైతే పగులగొట్టుకుంటూ ముక్కుకు సూటిగా వెళ్ళిపోవాలి. అదే ధీర లక్షణం.

#నిష్కటంకమైన = ఏ అడ్డంకులూ లేని

తప్పులెన్నువారు(2) - 1983

పని చేయని వారు పలువురు. వారికి ఏంచేయాలో తోచదు. పదుగురకు పనికివచ్చేదేదో చేసి చూతాం అన్న ఆలోచనే వీరికి రాదు. కదిలితే కందిపోతామేమో అని కలత చెందిపోతూ ఉంటారు. ఎదిరిని విమర్శించడం, వారినీ కదలకుండా దిగ్భంధనం చేదామని చూడడం - ఇదే వీరి పని. మాటలతో ఏమీ కాదని తెలిసినా వాటితోనే గాలిమేడలు కడుతూంటారు. గంధర్వ నగరాలు నిర్మిస్తూంటారు. ఏం చెప్పినా, పోదురూ అదెక్కడ సాధ్యం? అని సాగదీస్తూంటారు. ఏ పనిలోనైనా ఏవో సాధకబాధకాలుండకపోవు. కేవలం అందులోని ఇబ్బందులే చెప్తూ, వాటినే చూస్తూ పోతే ఇక ఎవరూ ఏమీ చేయలేరు. అసలలా చేయకపోవడమే వీరికి ఇష్టం. నిర్వ్యాపారత్వం కాపురుష గుణమని పెద్దలన్నా వీరు పాటించరు. పనికిమాలినవారై ప్రతిదానికీ పరాజ్ఞ్ముఖులై పరమోత్తమమైన పని అయినా అది కానిదీ పోనిదీ అని ఆటంకపరుస్తూ ఉంటారు.

#కాపురుషుడు = పిరికివాడు, కుత్సిత బుద్ధి కలవాడు
#పరాజ్ఞ్ముఖుడు = పెడమొగము పెట్టుకొనేవాడు

తప్పులెన్నువారు(1) - 1983

"గఛ్ఛతస్సఖలనం న దోషాయ" - నడిచేవాని కాలు జారితే అందులో తప్పేం లేదు. కదలకుండా మెదలకుండా కూర్చున్నవాని కాలు జారే ప్రసక్తే లేదు. పని చేసేవాడే తప్పులూ చేస్తాడు. పనీపాటా లేనివానికి ఆ అవసరం ఉండదు. కనుకనే ఏదో తప్పు చేస్తామేమో అని ఏ పనీ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోవడం సరికాదు. ముందు పనికి సిద్ధపడాలి. తర్వాత మిగతావన్నీ చూసుకోవచ్చు. చాలామంది తామేమీ చేయకుండా ఏదో చేసేవారిని తప్పులు పడుతూ కూచుంటారు. తప్పులు పట్టడం సులభం. ఏవో వంకలు వెతకడం సులభం. అసలది కార్యవాది లక్షణం కాదు. కానేకాదు. క్రియాపరత లేనప్పుడే ఈ రంధ్రాన్వేషణపరత్వం అలవడుతుంది. ఎవరేం చేసినా ఏదో తప్పులు నెమకుతూ వారిని కూడా నిరుత్సాహపరచి, తామూ చేయక, ఇంకొకరినీ చేయనీయక ఇలాంటివారు కాలక్షేపం చేస్తూంటారు.

#నెమకుతూ = వెదకుతూ